న్యూఢిల్లీ, జనవరి 12: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం ఢిల్లీ-ఎయిమ్స్‌లో చేరారు. గత శనివారం ఆయన వాష్‌రూమ్‌కు వెళ్తూ రెండుమార్లు స్పృహ కోల్పోవటంతో, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది. సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దవాఖానలో చేరాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. ఆయనకు ఎంఆర్ఐ చేయనున్నట్టు తెలిపారు.
74 ఏండ్ల ధన్‌ఖడ్‌కు వైద్యులు ఇటీవలే యాంజియోప్లాస్టీ చేశారు. ఆరోగ్య కారణాలను చూపుతూ ఆయన గత ఏడాది జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అటు తర్వాత ఆయన బయటకు కనిపించటం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనటం పూర్తిగా తగ్గిపోయింది. ఆయన ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేయటం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.