న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నట్టు తెలిపాయి. రెండు నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో సోనియా జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
రాయ్‌బరేలి నుంచి ఎంపీగా ఐదు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ పోటీలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక 1999లో తొలిసారి సోనియా ఎంపీగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయసంగా కైవసం చేసుకోగలదు.