చండీగఢ్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీలతోపాటు బీజేపీ – పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి, శిరోమణి అకాలీదళ్ – బీఎస్పీ కూటమి పోటీలుపడి ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్ అసెంబ్లీ ప్రచారాన్ని మరింత రక్తి కట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ 30 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించబోతున్నది.
ఈ మేరకు 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్, రణ్‌దీప్ సుర్జేవాలా, భూపేష్ బఘేల్, రాజీవ్ శుక్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరుల పేర్లు ఉన్నాయి.
పంజాబ్‌లో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ఆప్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. శిరోమణి అకాలీదళ్ పార్టీ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో, అమరీందర్‌సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నాయి.