బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకున్నది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కన్నడ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజ్వల్ సోదరుడు డాక్టర్ సూరజ్ రేవణ్ణపై (Suraj Revanna) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అయిన సూరజ్.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడని చేతన్ కేఎస్ అనే జేడీఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లాకు అరకలగూడుకు చెందిన అతడు వీడియోలను కూడా విడుదల చేశాడు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి దాడికి యత్నించడాని ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షల్లో యువకుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
కాగా, తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశాడని, ఇవ్వకపోతే లైంగికదాడి చేసినట్టు కేసు పెడతానని బెదిరించినట్టు ఎమ్మెల్సీ సూరజ్ అనుచరుడు శివకుమార్ హోళినరిసిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనతో స్నేహం చేసిన చేతన్.. జూన్ 16న గన్నికొండ ఫామ్‌హౌస్‌కు వచ్చి తనను కలిశాడని, ఉద్యోగం ఇప్పించాలని కోరాడని శివకుమార్ తెలిపారు. దీంతో సూరజ్ ఫోన్ నంబర్ ఇచ్చి ఆయన్ను సంప్రదించాలని చెప్పానని, ఆ తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడని ఆరోపించారు. అతడు ఫామ్‌హౌస్‌కు వచ్చినప్పుడు పోలీసులతో పాటు చాలా మంది ఉన్నారని పేర్కొన్నాడు. మొదట రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, తర్వాత దానిని రూ.2 కోట్లకు తగ్గించాడని వెల్లడించాడు.