Oomen Chandy | కేరళ సీఎంబెంగళూరు, తిరువనంతపురం, జూలై 18: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) మంగళవారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, తెలంగాణ,కేరళ, తమిళనాడు సీఎంలు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెల్లని దుస్తుల్లో సామాన్యుడిలా కనిపించిన ఆయన తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. చాందీ విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సొంత నియోజకవర్గం పుతుప్పల్లి నుంచి వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కేరళ అసెంబ్లీకి సుదీర్ఘ కాలం సేవలందించిన ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. సోలార్ స్కామ్‌లో ఆయన ప్రమేయం ఉన్నదని 2016లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సీబీఐ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది.
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మరణం పట్ల సీఎం కే చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. సాధారణ జీవితం గడుపుతూ ప్రజాదరణ పొందిన ఉత్తమ రాజకీయవేత్తగా ఊమెన్‌చాందీ కేరళ ప్రజలకు అందించిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఊమెన్ చాందీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.