బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 92 ఏండ్ల ఎస్ఎం కృష్ణ.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఆయన సొంత జిల్లా మండ్యలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఎస్ఎం కృష్ణ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్ సహచరులు ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. కర్ణాటక సర్కారు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
మృదుభాషి, ఉన్నతి విద్యావంతుడైన సోమవనహళ్లి మల్లయ్య కృష్ణ 1962లో కర్ణాటకలోని మద్దూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొంది 30 ఏండ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతర కాలంలో కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బెంగళూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కృష్ణ పాత్ర ఎనలేనిదని ఐటీ రంగ నిపుణులు చెబుతారు. 1968లో సోషలిస్టు ఎంపీగా 4వ లోక్‌సభలోకి మొదటిసారి అడుగుపెట్టారు. 1972లో ఆయన రాష్ట్ర రాజకీయాలకు తిరిగిరావలసి వచ్చింది. 1980లో మళ్లీ లోక్‌సభలోకి అడుగుపెట్టిన కృష్ణ 1983-84లో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, 1984-85లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తర్వాత కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా, ఉప ముఖ్యమంత్రిగా రాజ్యసభ సభ్యునిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో బీజేపీలో చేరిన కృష్ణ 2023లో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు.
అప్పట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన డెమోక్రాట్ అభ్యర్థి జాన్ ఎఫ్ కెనడీ కోసం కృష్ణ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన కెనడీ భారతీయుల ఓట్లు తనకు లభించేందుకు కృష్ణ చేసిన కృషిని కొనియాడారు.