Nariman on Rijiju | కొలీజియం, దాని సిఫారసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గత కొన్నిరోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కొలీజియం సిఫారసులు పారదర్శకంగా ఉండాలంటూ ఇటీలల కొత్త పాటను ఎత్తుకున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా సుప్రీంకోర్టు పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు తీరును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తీవ్రంగా దుయ్యబట్టారు. ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈయన 2021 ఆగస్టులో పదవీ విరమణ చేయడానికి ముందు కొలీజియంలో భాగంగా ఉన్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ ఫాలీ నారిమన్ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును టార్గెట్ చేశారు. శుక్రవారం ముంబై యూనివర్శిటీ న్యాయ విభాగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నారిమన్ మాట్లాడుతూ, కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమన్నారు. అలాగే కోర్టు నిర్ణయాన్ని అంగీకరించడం తన విధి అని న్యాయశాఖ మంత్రికి గుర్తుచేశారు. న్యాయశాఖ మంత్రి తెలుసుకోవలసిన రెండు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని ఫాలి నారిమన్ తెలిపారు.
న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేసిన తర్వాత ప్రభుత్వం 30 రోజుల్లోగా స్పందించాలని ఫాలి నారిమన్ సూచించారు. ప్రభుత్వం నిర్ణీత గడువులోగా స్పందించకుంటే.. ప్రభుత్వం చెప్పేదేమీ లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని చెప్పారు. కొలీజియం స్వతంత్రంగా లేకపోతే దాని నిర్ణయాలు ఒకరిద్దరికే అనుకూలంగా వస్తాయన్నారు. కొలీజియం వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోకుండా దాన్ని తొలగించాలని చూడకూడదని చెప్పారు.