హైదరాబాద్, సెప్టెంబర్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ మంత్రిగా ఫెయిల్ అయ్యారని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ తీవ్రంగా మండిపడ్డారు. బెంగళూరు రోడ్లమీద ఉన్న గుంతలను 15 రోజుల్లోగా పూడ్చుతానంటూ వాగ్దానం చేసిన డీకే.. హాలీడే పేరిట అమెరికాలో షికారు చేస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఇటీవలి వర్షాలతో బెంగళూరు రోడ్లన్నీ గుంతలమయమైనట్లు వచ్చిన ఫిర్యాదులపై డీకే ఈ నెల 1న స్పందించారు. 15 రోజుల్లోగా గుంతలన్నింటినీ పూడ్చేయాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించారు. పనులు జరగకపోతే కఠిన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. కానీ పరిస్థితి యథాతథంగా కొనసాగుతుండటంతో వాహనదారుల అవస్థలను బీజేపీ ఎంపీ పీసీ మోహన్ బుధవారం ఎక్స్ వేదికగా వివరించారు.