భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యంతో బాధపడుతున్నా, వీల్‌చైర్‌కే పరిమితమైనా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. పీవీ నాయకత్వంలో నడిచి, ఆర్థిక సంస్కరణలకు బాటలు పరిచిన దార్శనికుడు మన్మోహన్. సరళీకృత ఆర్థిక విధానాలతో.. మౌనంగానే దేశగతిని మార్చారు. ఆరు దశాబ్దాలపాటు రాజకీయాల్లో అజాతశత్రువుగానే ఆయన కొనసాగారు. మన్మోహన్సింగ్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు, రాజకీయవేత్తలు సంతాపం వ్యక్తంచేశారు.
Manmohan Singh | న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డుకు తెచ్చిన ఘనత మన్మోహన్‌దే. సరళతర ఆర్థిక విధానాల రూపకర్తగా, దేశ ఆర్థికవ్యవస్థకు కొత్తదిశను చూపిన మార్గదర్శిగా ఆయన నిలిచారు.
1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్థాన్‌లోని గాహ్ ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్‌కు వచ్చి మొదట హల్దానీలో, ఆ తర్వాత అమృత్‌సర్‌లో స్థిరపడింది. మన్మోహన్ చిన్న వయసులోనే ఆయన తల్లి మృతి చెందడంతో నానమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో డిగ్రీ, 1954లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత భారత్‌కు తిరిగొచ్చి తను చదివిన పంజాబ్ యూనివర్సిటీలోనే ఎకనమిక్స్ సీనియర్ లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లోనూ ఆయన కొంతకాలం ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు సలహాదారుగా వ్యవహరించారు. 1972 నుంచి 1976 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1985 నుంచి 1987 వరకు ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా ఆయన ఎదిగారు.
విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా మన్మోహన్ తనదైన ముద్ర వేశారు. ఆర్థిక రంగంలో ఆయన అనుభవం, జ్ఞానంతో ఎన్నో గొప్ప అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహారావు.. మన్మోహన్ సింగ్‌కు అనూహ్యంగా తన క్యాబినెట్లో చోటు కల్పించి ఆర్థికమంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను గట్టెక్కించడమే కాకుండా, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు.
1991లో మొదటిసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్ 2019 వరకు కొనసాగారు. 2019లో రాజస్థాన్‌కు మారి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1998 నుంచి 2004 వరకు వాజ్‌పేయీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మన్మోహన్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించినా అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్ సింగ్‌కు దక్కింది. 2004 మే 22న మొదటిసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేండ్ల తన పాలనకు ప్రజామోదాన్ని పొంది 2009లో మరోసారి ప్రధాని అయ్యారు. పదేండ్ల పాటు ప్రధానిగా కొనసాగి, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పని చేసిన నాలుగో వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ప్రధానిగా పని చేసినప్పుడు ఆయనను మౌనమునిగా ప్రతిపక్షాలు విమర్శించేవి. అయితే, ఆయన మౌనంగా ఉంటూనే దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలో ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చేపట్టారు. 2008లో వామపక్షాలు వ్యతిరేకించినా, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా అమెరికాలో పౌర అణు ఒప్పందాన్ని చేసుకున్నారు. మన్మోహన్ ప్రభుత్వంలో దేశంలో జరిగిన మార్పులను గుర్తించిన ప్రజలు 2009లో మరోసారి యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. 2009 మే 22న మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
‘విద్య, పరిపాలనను సులభంగా నడిపించిన అరుదైన రాజకీయ నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థ సంస్కరణలో ఆయన సేవలు కీలకమైనవి. దేశానికి ఆయన చేసిన సేవలు, నిష్కళంకమైన రాజకీయ జీవితం, ఆయన వినయం చిరస్మరణీయం. ఆయన మరణం మనందరికీ తీరని లోటు’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
‘విశిష్టమైన నాయకుల్లో ఒకరిని కోల్పోవడంతో భారత్ దుఃఖంలో మునిగిపోయింది. వినమ్రమైన మూలాల నుంచి ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రి సహా అనేక ప్రభుత్వ హోదాల్లో పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారు’ అని ప్రధాని మోదీ అన్నారు.
దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను, రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పూసగుచ్చినట్టు వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడాయన. 1971లో తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని మాటతప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.
పీవీ నరసింహారావు, కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్‌తో మన్మోహన్‌ది ప్రత్యేక అనుబంధం. మన్మోహన్ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీనే. కాకతీయ విశ్వవిద్యాలయం మన్మోహన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సమయంలో వీసీగా ఉన్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌తోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2004 ఎన్నికల ముందు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన ఆనాటి టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోక తప్పని అనివార్యత ఏర్పడింది. ఆ సమయంలో కేసీఆర్‌ను ఒప్పించేందుకు మన్మోహన్సింగ్ తెరవెనుక ప్రొఫెసర్ జయశంకర్ ద్వారా సమాలోచనలు చేశారు. కేసీఆర్‌ను ‘చంద్రశేఖర్‌జీ’ అని ఆయన ఆప్యాయంగా సంభోదించేవారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు చలించిపోయిన సున్నిత మనస్కుడు మన్మోహన్ సింగ్.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా… కేసీఆర్‌కు, మన్మోహన్ సింగ్‌కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్ సూచనలు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ తెచ్చిన ఆర్థిక సంసరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దు బిడ్డగా కొనియాడారు.
మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని అన్నారు. మితభాషిగా, సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, ప్రధానిగా మన్మోహన్ దేశానికి అందించిన సేవలు గొప్పవని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా అందించిన మద్దతును తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందన్నారు. మన్మోహన్సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
మన్మోహన్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆధునిక భారత నిశ్శబ్ద వాస్తుశిల్పి అని, నిజమైన మేధావి, మానవతామూర్తని కొనియాడారు. దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతారన్నారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
మన్మోహన్ మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. దూరదృష్టి గల నాయకుడని, భారతదేశ ఆర్థిక సంసరణలకు రూపశిల్పి అని స్మరించుకున్నారు. ప్రజాసేవలో ఆయన అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు.
మన్మోహన్ మృతిపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో పాటు, బీఆర్ఎస్ మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. మన్మోహన్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కూడా సంతాపం తెలిపారు.