చండీగఢ్: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా (Om Prakash Chautala) కన్నుమూశారు. 89 ఏళ్ల వయస్సున్న ఆయన శుక్రవారం గుర్గావ్ నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) చీఫ్ అయిన ఓం ప్రకాష్ చౌతాలా హర్యానాకు ఐదుసార్లు సీఎంగా వ్యవహరించారు. భారత మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ కుమారుడైన ఆయన 1989లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేవలం ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగారు. రెండు నెలల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ఐదు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.1991లో మూడవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే రెండు వారాల్లోనే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.1999 నుంచి 2005 వరకు వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నారు.
కాగా, 2000లో అధికారంలో ఉన్నప్పుడు 3,206 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నియమించినట్లు ఓం ప్రకాష్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ సింగ్ చౌతాలాపై ఆరోపణలు వచ్చాయి. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి 2013లో వారిద్దరికి పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన వారికి 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆరు నెలల ప్రత్యేక ఉపశమనం కల్పించడంతో చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు.
మరోవైపు 16 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు 2022 మే 27న చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో 87 ఏళ్ల వయస్సులో అత్యంత వృద్ధ ఖైదీగా తీహార్ జైలులో ఆయన గడిపారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 5న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఓం ప్రకాష్ చౌతాలా చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. సిర్సాలోని చౌతాలా గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.