Satyapal Malik | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశాన్ని సర్వనాశనం చేసేస్తారని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీని గద్దె దించాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. పుల్వామా దాడికి భద్రతా వైఫల్యమే కారణమని, ఈ విషయం తాను మోదీకి చెబితే, నోరు మూసుకొమ్మన్నారని ఇటీవల సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆయనను ఇంటర్యూ చేస్తూ సంచలన విషయాలు బయట పెడుతున్నాయి. ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్’ కూడా సత్యపాల్‌ను ఇంటర్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన నరేంద్ర మోదీ అంటే ఆరెస్సెస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్‌కు ఇష్టం లేదని చెప్పారు.
ఆరెస్సెస్ ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపు చూస్తున్నదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా యోగీని ప్రకటించాలని ఆరెస్సెస్ ఆలోచిస్తున్నదని, అయితే డబ్బే ప్రధానమని భావించే ఆరెస్సెస్‌లోని ఓ వర్గం మోదీకి మద్దతు ఇస్తున్నదని పేర్కొన్నారు. ప్రతిసారీ హిందూ ఎజెండా పని చేయదు బీజేపీ వాళ్లు హిందూత్వను రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారని, మైనారిటీలపై దాడులు చేయించి రాజకీయ లబ్ధి పొందటంలో సఫలీకృతులయ్యారని సత్యపాల్ విశ్లేషించారు. అయితే ప్రతిసారి హిందూ ఎజెండా పని చేయదని స్పష్టం చేశారు. హిందువుల్లోని యువకులు, మహిళలు, రైతులు… ఇలా వివిధ వర్గాల వారు కేంద్రంలోని బీజేపీ పాలనపై విసిగిపోయారని చెప్పారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు వ్యతిరేక విధానాలు లాంటివి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయవాద పార్టీ అన్న ముద్ర కూడా భ్రమేనని సత్యపాల్ మాలిక్ అన్నారు. అవినీతికి వ్యతిరేకినని చెప్పుకొనే మోదీ తన మిత్రుడు గౌతమ్ అదానీకి అప్పనంగా 11 విమానాశ్రయాలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరనన్నారు. రెండు గదుల అద్దె ఇంట్లోనే నివసిస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాది రాష్ర్టాల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ అసమర్థ, పక్షపాత చర్యలను ఎండ గడతానని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు.