బెంగళూర్ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో గాంధీ కుటుంబంపై దర్యాప్తు సంస్ధల వేధింపులకు నిరసనగా రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. బెంగళూర్‌లో నిరసన చేపట్టిన కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాము న్యాయం కోసం పోరాడుతున్నామని..నిరసన తెలపడం తమ హక్కని డీకే శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ నేతలపై కేసులు పెట్టడం లేదని, కేవలం కాంగ్రెస్ నేతలనే వేధిస్తున్నారని డీకే ఆక్షేపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్‌కు మెమొరాండం సమర్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్‌కు వెళుతుండగా పోలీసులు అడ్డగించారు.
గాంధీ కుటుంబంపై రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితో మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు విచారించిన ఈడీ ఇప్పటివరకూ 30 గంటల పాటు ప్రశ్నించింది. వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ శుక్రవారం మరోసారి విచారణకు హాజరు కావాలని కోరింది. ఇక ఇదే కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని జూన్ 23న ఈడీ ప్రశ్నించనుంది.