UP Assembly Results | ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అధికార బీజేపీ దూసుకెళ్తున్నది. సమాజ్‌వాదీ పార్టీతోపాటు ఇతర విపక్షాలు చేసిన పొరపాట్లకు మూల్యం చెల్లించుకున్నాయి. పలు దఫాలు సీఎంగా పని చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సారి వ్యూహాత్మకంగా వ్యవహరించారా.. తన పాత ప్రత్యర్థి సమాజ్‌వాదీని దెబ్బ తీశారా? అన్న కోణంలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 122 స్థానాల్లో ఎస్పీ పోటీ చేసిన సామాజిక వర్గాల నేతలనే బీఎస్పీ బరిలో దించారు. వీటిలో 91 ముస్లింల మెజారిటీ, 15 యాదవ్‌లు ఆధిపత్యం గల స్థానాలు. ఈ స్థానాల్లో విజయం లేదా ఓటమి వ్యత్యాసం చాలా తక్కువగా కనిపిస్తున్నది. ఇప్పటికైతే 122 స్థానాల్లో బీజేపీ 64 చోట్ల ఆధిక్యంలో ఉన్నది. ఎస్పీతోపాటు బీఎస్పీ ఒకే సామాజిక వర్గ నేతలను పోటీలో నిలబెట్టకపోతే ఈ స్థానాల్లో ఎస్పీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో దళిత హిందువుల ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీ భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఒకవైపు హిందూత్వ, జాతీయవాదం పెద్దపెట్టున హోరెత్తిస్తుంటే.. ఎస్పీ మాత్రం ఇంకా ముస్లింల ఆధిపత్యం గల పార్టీ అన్న ముద్రను తొలగించుకోలేకపోయింది. బాహుబలి ముక్తార్ అన్సారీ తనయుడు అబ్బాస్ అన్సారీ వంటి పలువురు ఎస్పీ నేతలు అధికారులను బెదిరించారు. ఎస్పీకి గంపగుత్తగా పడతాయనుకున్న హిందూ ఓట్లు భారీగా చీలిపోయాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నారు.
హిందుత్వ పునరేకీకరణలో బీజేపీ సక్సెస్
హిందూ ఓటుబ్యాంకు పునరేకీకరణలో బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో ప్రతి అంశాన్ని నిరంతరం హిందూత్వతో లింక్ చేశారు. తొలి దశలో పోలింగ్ జరిగిన బీజేపీ-చాణక్యుడిగా పేరొందిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ యూపీలో ప్రచార బరిలో దిగారు. అగ్రశ్రేణి బీజేపీ నాయకత్వం అక్కడే తిష్ట వేసి స్థానిక జాట్లను మెప్పించగలిగారు. అరుదుగానైనా పశ్చిమ యూపీలోని జాట్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓట్లలో తేడాలొచ్చాయి. అగ్రకులాల్లోఈ తేడా స్పష్టంగా ఉంది. మరోవైపు చివరి దశలో ప్రధాని నరేంద్రమోదీ కాశీలో మూడు రోజులు బస చేశారు. విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలతో తానే హిందువులను కాపాడగలనని రుజువుచేసుకున్నారు.
ఇక 192 స్థానాలను కవర్ చేస్తూ ప్రధాని మోదీ 19 బహిరంగసభల్లో మాట్లాడారు. వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 70 బహిరంగసభల్లో 58 సభల్లో పదేపదే బుల్డోజర్ల అంశం లేవనెత్తారు. ఈ స్థానాల్లోనూ బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. ముస్లింల ఓటేయకున్నా బీజేపీ ఓటు శాతం 42 శాతానికి చేరింది. 2017 ఎన్నికలతో పోలిస్తే మూడు శాతానికి పై చిలుకే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటు బ్యాంకు 22.9 శాతమైతే, ఈ దఫా అది 12.7 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి మాయావతి హిందూ దళిత్ ఓటు బ్యాంకు భారీగా బీజేపీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తున్నది. ఇక సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రాతినిధ్యం వహిస్తున్న యాదవ్ల్లో ఘోసీ, కమారియా వర్గాలుగా విడిపోవడం బీజేపీకి లబ్ధి చేకూరినట్లు సమాచారం. రామ మందిరం గల అయోధ్యలో, విశ్వనాథ ఆలయం గల కాశీలో పోటాపోటీ సాగినా, బీజేపీ హిందూత్వ నినాదాన్ని బలోపేతం చేసింది.
సాగు చట్టాలు, నిరుద్యోగ అంశం తమను దెబ్బ తీస్తాయనుకున్న బీజేపీ భయం.. అధికారం తెచ్చి పెడతాయని ఎస్పీ పెట్టుకున్న ఆశలు పని చేయలేదు. ఇది పశ్చిమ యూపీలో స్పష్టంగా కనిపించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. పశ్చిమ యూపీలో హిందూ ఓట్ల పునరేకీకరణలో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీశ్ మిశ్రా రైతులపైకి కార్ల కాన్వాయ్ నడిపించిన లఖీంపూరిలో ఎనిమిది సీట్లలో ఏడింటిల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది.
దళితుల ఓటు బ్యాంకు పెంచుకున్న బీజేపీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడం చాలా తేలిక కానున్నది. గత ఎన్నికల్లో గెలుపొటములకు ఓట్ల తేడా 18 శాతం మాత్రమే. సాధారణంగా ఐదు శాతం ఓటు ప్రభుత్వాన్ని మార్చేస్తుంది. కానీ గత ఎన్నికల్లో 39 శాతం ఓట్లు పొందిన బీజేపీ.. ఈ దఫా 42 శాతానికి చేరువలో ఉన్నది. దీన్ని బట్టి అతిపెద్ద సెక్షన్ బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నది. బీఎస్పీ ఓట్ల శాతం, సీట్ల ట్రెండ్ చూస్తే ఆ పార్టీ ఓటు మొత్తం బీజేపీకి బదిలీ అయినట్లు అనిపిస్తున్నది.
యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి కేంద్రం సాగు చట్టాలు తీసుకొచ్చే అంశాన్ని పునః పరిశీలించొచ్చునని భావిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి ( Uniform Civil Law ) వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట మాఫియాపై చర్యలు తీసుకున్నది యూపీ సర్కార్. మున్ముందు హిందూత్వ ఏజెండా దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.