లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సరైన ప్రణాళిక కొరవడింది. భూమి అందుబాటులో ఉందో, లేదో చూసుకోకుండానే, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించేశారు. ఒక వైపు నిర్మాణం పూర్తి కాగా, రెండోవైపు భూమిని సేకరించేందుకు ఇప్పటికీ సన్నాహాలను ప్రారంభించలేదు. పారా-రాజాజీ పురం మధ్య 857.92 మీటర్ల పొడవున ఫ్లైఓవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీని నిర్మాణానికి రూ.153 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాజాజీ పురం నుంచి 168 మీటర్ల వరకు మాత్రమే దీనిని నిర్మించారు. ఆ తర్వాత పారా వైపు భూమి అందుబాటులో లేకపోవడంతో పనులను నిలిపేశారు. దీంతో ప్రజలు 4 కి.మీ. అదనంగా ప్రయాణించవలసి వస్తున్నది. రైల్వే క్రాసింగ్స్ వద్ద తరచూ వేచి ఉండవలసి వస్తున్నది.