లేహ్: లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం(Drones Banned) విధించారు. డ్రోన్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, జాతి వ్యతిరేకులు వాటిని తప్పుగా వాడే ఛాన్సు ఉందని అధికారులు హెచ్చరించారు. స్థానికులు, పర్యాటకులు, ప్రైవేటు వ్యక్తులు డ్రోన్లు ఎగురవేయరాదు అని లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ సంతోష్ సుఖదేవ్ తన ఆదేశాల్లో తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే, న్యాయపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రజల రక్షణ, భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను భారత రక్షణ దళాలు ధ్వంసం చేసిన తర్వాత స్థానిక ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. డ్రోన్ల కదలికలు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశాల్లో చెప్పారు. విమానాలు రద్దు కావడం వల్ల చిక్కుకుపోయిన టూరిస్టులకు బస ఏర్పాట్లు కల్పించనున్నట్లు తెలిపారు.