లేహ్: లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలోని కార్గిల్, లేహ్ జిల్లాల్లో డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలు (యూఏవీ)లను ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా జారీ చేసిన ఆదేశాల్లో, దేశ వ్యతిరేక శక్తులు వీటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలిపారు.
వీటిని ఎగురవేసే స్థానికులు, పర్యాటకులు లేదా ప్రైవేట్ వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రోన్ లేదా యూఏవీ ఎగురుతుండటాన్ని చూస్తే, వెంటనే ఆ సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు లేదా సమీపంలోని పోలీసు లేదా ఇతర అధికారులకు తెలియజేయాలని కోరారు.