న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఎయిర్‌పోర్టుల సమీపంలో జీపీఎస్ జామ్, సంబంధిత సమస్యలు విమానాలకు ఎదురైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. (GPS spoofing) సోమవారం పార్లమెంట్‌కు ఈ విషయం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2023 నవంబర్‌లో జీపీఎస్ జామింగ్ లేదా స్పూఫింగ్ సంఘటనలపై రిపోర్ట్ చేయడాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తప్పనిసరి చేసిందన్నారు. దీంతో ఢిల్లీతో పాటు కోల్‌కతా, అమృత్సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల నుంచి వీటిపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
కాగా, నవంబర్ 6న జీపీఎస్ జామ్, జీపీఎస్‌లో సాంకేతిక సమస్యల వల్ల ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో సుమారు 800కు పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. అయితే జీపీఎస్ స్పూఫింగ్ కారణమైనప్పటికీ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ఉపగ్రహ ఆధారిత ల్యాండింగ్ విధానాలకు ఆటంకం కలిగినప్పుడు రన్‌వే 10లో ఉన్న సాంప్రదాయ, భూ ఆధారిత నావిగేషన్ ద్వారా దీనిని అదిగమించినట్లు చెప్పారు.
మరోవైపు ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా సాంప్రదాయ, భూ ఆధారిత నావిగేషన్, నిఘా వ్యవస్థల ఆపరేటింగ్ నెట్‌వర్క్‌ను భారత్ కొనసాగిస్తున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌కు అంతరాయం కలిగినప్పుడు ఈ వ్యవస్థలు బ్యాకప్ అందిస్తాయని పేర్కొంది. జీపీఎస్‌ను జామ్ చేయడం, అడ్డుకునేందుకు ప్రయత్నించే మూలాలను గుర్తించేందుకు దర్యప్తు చేస్తున్నట్లు తెలిపింది. వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో) సహాయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కోరినట్లు పేర్కొంది.
ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే రాన్సమ్వేర్, మాల్వేర్తో సహా విమానయాన రంగం ఎదుర్కొనే విస్తృత సైబర్ సెక్యూరిటీ ముప్పులను కూడా మంత్రి రామ్ మోహన్ నాయుడు హైలైట్ చేశారు. వీటిని ఎదుర్కొనేందుకు ఐటీ నెట్‌వర్క్‌లు, మౌలిక సదుపాయాల కల్పన, అధునాతన సైబర్ భద్రతా ఏర్పాట్లను ఏఏఐ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (ఎన్సీఐఐపీసీ), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ అప్గ్రేడ్లు జరుగుతున్నట్లు చెప్పారు. సైబర్ భద్రతా చర్యలను నిరంతరం మెరుగుపర్చడంతోపాటు ప్రపంచ విమానయాన భద్రతా వేదికలలో భారత్ పాల్గొంటున్నదని వివరించారు.
Also Read:
Woman’s Jaw Dislocates | పానీపూరీ తినేందుకు పెద్దగా నోరు తెరిచిన మహిళ.. విరిగిన దవడ
Bengal BLO’s Protest | బెంగాల్లో పోలింగ్ బూత్ స్థాయి అధికారుల నిరసన.. ‘సర్’ పని ఒత్తిడిపై ఆందోళన