Northeastern States | నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో (Northeastern States) ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడ కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి (Flash Floods). వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఎన్డీఆర్ఎప్, ఐఏఎఫ్ దళాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల విషయంలో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో జూన్ 4 వరకూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read..
Sikkim | మిలిటరీ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
Bihar Elections | మూడు దశల్లో బీహార్ ఎన్నికలు..?
Aadhar Update | త్వరలో ముగియనున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు.. అప్డేట్ చేసుకోండిలా