Aadhar Update | నేటి సమాజంలో ఆధార్ కార్డు (aadhaar card) వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటికి అధార్ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం.
దీంతోపాటు ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆధార్‌లో మార్పులు, చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి 2025 జూన్ 14 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉడాయ్ ఇచ్చిన గడువు మరో పది రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ వివరాలు అప్డేట్ చేసుకోని వారు ఉడాయ్ అధికార వెబ్సైట్ http://myaadhar.uidai.gov.inలో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు.
https:// myaadhaar.uidai.gov.in పోర్టల్‌లో ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే స్క్రీన్‌పై వివరాలు వస్తాయి. వాటిని పూర్తిగా పరిశీలించి సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోలింగ్ చేస్తే వచ్చే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే అప్డేట్ పూర్తయినట్లు పోన్ నెంబర్‌కు పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక గడువు ముగిసిన అనంతరం అప్డేట్తో పాటు ఫొటో, నివాసం, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు విధిగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read..
2000 Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన..
Kamal Haasan | కన్నడ భాషపై వివాదం.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
Sikkim | మిలిటరీ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి