Fixed Deposit | న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసే తీరు క్రమంగా మారుతున్నది. స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పథకాల్లో పెట్టుబడులను తగ్గిస్తున్నారు. డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటివాటి వైపు ఆకర్షితులవుతున్నారు. 2022 నుంచి 2024 చివరి త్రైమాసికం వరకు స్టాక్ ధరల్లో ర్యాలీ వల్ల ప్రజలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విడుదల చేసిన నెలవారీ బులెటిన్ ప్రకారం, సాధారణ కుటుంబాల బ్యాంక్ డిపాజిట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8.97 శాతం తగ్గిపోయి, రూ.12.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
అంతకు ముందు రెండేండ్లలో కనిపించిన వృద్ధి తిరోగమనం బాట పట్టింది. జీవిత బీమా నిధుల్లో పెట్టుబడులు 17.3 శాతం తగ్గి, రూ.5.3 లక్షల కోట్లకు చేరాయి. పీపీఎఫ్ మినహా చిన్న మొత్తాల పొదుపులు 24 శాతం పతనమయ్యాయి. తక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చే సురక్షిత పెట్టుబడులను మదుపరులు గట్టిగా తిరస్కరిస్తున్నారు. ప్రజలు తమ సొమ్మును అధిక ప్రతిఫలాన్ని ఇచ్చే పథకాల్లో పెడుతున్నారు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు దాదాపు 153 శాతం పెరిగాయి, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు 95 శాతం పెరిగాయి. కరెన్సీ హోల్డింగ్స్ కూడా 77.6 శాతం ఎగబాకాయి.
ప్రజలు నగదు అందుబాటులో ఉంచుకోవడానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే విధంగా వినియోగం కూడా అధికంగా కనిపించింది. 2021-22 నుంచి 2024-25 వరకు పొదుపులో బ్యాంక్ డిపాజిట్ల వాటా 40.9 శాతం నుంచి 35.2 శాతానికి తగ్గింది. అదే కాలంలో మ్యూచువల్ ఫండ్స్ వాటా 2.1 శాతం నుంచి 13.1 శాతానికి పెరిగింది. ఈక్విటీ హోల్డింగ్స్ వాటా 1.3 శాతం నుంచి 2.1 శాతానికి పెరిగింది. సాధారణ కుటుంబాలు పొదుపు చేసే తీరు క్రమంగా మారుతున్నట్లు ఈ గణాంకాలు చెప్తున్నాయి. సురక్షితమైన పొదుపు చేయాలనే భావం నుంచి అవకాశాల ఆధారిత మదుపు చేయడం వైపు ప్రజలు మారుతున్నట్లు వెల్లడవుతున్నది.