Karnataka | హైదరాబాద్, అక్టోబర్ 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ‘ఐదు గ్యారెంటీల’ ప్రకటనను చూసి కాంగ్రెస్‌ను గెలిపించిన కన్నడిగుల ఆశలన్నీ అడియాసలుగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అసలు స్వరూపం బట్టబయలైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సవాలక్ష కొర్రీలతో కాలయాపన చేస్తున్న హస్తం పార్టీ తీరును అక్కడి ప్రజలు ఎండగడుతున్నారు.
ఆరిన ‘గృహజ్యోతి’
200 యూనిట్ల వరకు ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్.. ఉచితం మాట అటుంచి ఎడాపెడా విద్యుత్తు కోతలు పెడుతున్నది. రాజధాని బెంగళూరులోనే రోజుకు నాలుగైదు గంటలపాటు కోతలు విధిస్తున్నది. ప్రచారం కోసం కొన్ని ఇండ్లకు ఉచిత కరెంటు సరఫరా చేసిన సర్కారు.. ఇప్పుడు అధిక బిల్లులతో వాత పెడుతున్నది.
భాగ్యంలేని ‘అన్నభాగ్య’
ఎన్నికల సమయంలో ‘అన్నభాగ్య’ స్కీమ్‌ను ఆర్భాటంగా ప్రచారం చేసిన కాంగ్రె స్.. అధికారంలోకి రాగానే బియ్యం దొరకటం లేదంటూ గగ్గోలు పెట్టింది. 10 కిలోల బియ్యాన్ని 5 కిలోలకు తగ్గించి రైస్ బదులు డబ్బులు ఇస్తామని ప్రకటించి అంతలోనే మెలికపెట్టింది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన బియ్యానికి కిలోకు ఎంతధర ఉండేదో అంతే ఇస్తామని చెప్పింది. నెలకు ఒక్కో ఖాతాలో కిలో బియ్యానికి రూ.34 జమ చేసింది. అదీ పూర్తిగా చేయట్లేదు.
సత్తువ కోల్పోయిన ‘శక్తి’
శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో కర్ణాటక ఆర్టీసీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అంచనాకంటే 8 రెట్లు ఎక్కువ ఖర్చుచేయాల్సి వచ్చింది. డీజిల్‌కు కూడా డబ్బులు లేక అనేక మార్గాల్లో బస్సులను నడపడాన్ని సర్కారు నిలిపేసింది. గతంలో 5-10 నిమిషాలకు వచ్చే ఒక్కో బస్సు, ఇప్పుడు 40 నిమిషాలకు కూడా రావట్లేదని ‘ది హిందూ’ న్యూస్ పేపర్ ఇటీవల చేసిన సర్వేలో మహిళలు భగ్గుమన్నారు.
‘యువనిధి’ నిర్వీర్యం
డిగ్రీ పాసైన యువతకు నెలకు రూ.3000, డిప్లొమా చేసినవారికి రూ. 1500ను నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామన్న పార్టీ ఆ హామీని పక్కనబెట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
పైసలు లేని ‘గృహలక్ష్మి’
ప్రతీఇంటి మహిళా పెద్ద బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 2 వేల చొప్పున జమ చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. కొందరికి.. అదీ ఒక్క నెల మాత్రమే చెల్లించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదని, గృహలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామన్న రూ. 2000ను ఎందుకు ఇవ్వట్లేదని ఏకంగా సీఎం సిద్ధరామయ్యనే పదుల సంఖ్యలో మహిళలు నిలదీశారంటే హామీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏమిటో అర్థంచేసుకోవచ్చు.