Maharashtra | నాగ్‌పుర్, ఆగస్టు 18: మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. పంట నష్టం, అప్పుల బాధ కారణంగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రైతుల బలవన్మరణానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోని రైతుల దుస్థితి మరీ దయనీయంగా ఉంటున్నది. తాజాగా విదర్భ రీజియన్‌లోని(తూర్పు మహారాష్ట్ర) యావత్మాల్ జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే ఐదుగురు అన్నదాతలు ఉసురుతీసుకొన్నారు. పంట నష్టం, వ్యవసాయ సంబంధిత ఆర్థిక ఇబ్బందులు, ఆప్పుల కారణంగా ఈ రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ నెల 13-15 మధ్య ఒక్క యావత్మాల్ జిల్లాలోనే ఐదుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకొన్నారని కిషోర్ తివారీ అనే సామాజిక కార్యకర్త ఒకరు శుక్రవారం పేర్కొన్నారు. విదర్భ రీజియన్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,565 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకొన్నారని వెల్లడించారు. కిషోర్ తివారీ అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ‘వసంత్‌రావ్ నాయక్ షెట్కరీ స్వావలంభి మిషన్’కు చైర్మన్‌గా పనిచేశారు.
యావత్మాల్ జిల్లాలోని యెరాడ్ గ్రామానికి చెందిన మనోజ్ రాథోడ్(35) అనే రైతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 15న ఉరేసుకొని చనిపోయాడని కిషోర్ తెలిపారు. 14న తెంభి గ్రామానికి చెందిన రైతు కర్ను కినకే (51), ఉమర్ వివిర్ గ్రామానికి చెందిన శాలు పవార్(42) పంట నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకొన్నారని చెప్పారు. అప్పుల కారణంగా నామ్దియో తివ్రాంగ్ గ్రామానికి చెందిన వాఘ్మారే(45), లోహర గ్రామానికి చెందిన రామ్రావ్ రాథోడ్(42) అనే మరో ఇద్దరు రైతులు ఈ నెల 13న బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
పంట నష్టం, పెరిగిన అప్పుల కారణంగా అమరావతి జిల్లాకు చెందిన మరో రైతు తనువు చాలించాడని కిషోర్ తివారీ తెలిపారు. ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తి.. మార్కెట్లో తక్కువ డిమాండ్ ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి వ్యయం పెరిగిందని, దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్యాంకులు రైతులకు తక్కువగా రుణాలు ఇస్తున్నాయని, ఇది సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. కాగా, యావత్మాల్ జిల్లాలో ఇటీవల ఐదుగురు రైతులు ఆత్యహత్య చేసుకొన్న విషయాన్ని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఘటనలపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.