కన్నూరు: ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రక్షణ శాఖ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 9.20 గంటలకు కన్నూరు జిల్లాలోని అజిక్కల్ పోర్టు సమీపంలో కంటెయినర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నౌకలోని 22 మంది సిబ్బందిలో 18 మంది సముద్రంలోకి దూకేశారు. వీరిని భారత నావికాదళం, కోస్ట్‌గార్డ్ రక్షించాయి. వీరిని ఐఎన్ఎస్ సూరత్‌లో మంగళూరు పోర్టుకు తరలిస్తున్నారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మండే స్వభావం గల ఘన, ద్రవ పదార్థాలు, విషపూరిత పదార్థాలు ఈ నౌకలోని కంటెయినర్లలో ఉన్నాయి. ఈ నౌకలోని సిబ్బందిలో భారతీయులు లేరు. వీరంతా చైనా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు చెందినవారు. ఇది శ్రీలంకలోని కొలంబో నుంచి ముంబైలోని నవ సేవకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.