Fire Accident News : ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి/తుగ్లకాబాద్ (Govindpuri/Thuglakabad) ఎక్స్టెన్షన్ ప్రాంతంలో జూన్ 12న జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ఊహించని మలుపు వెలుగుచూసింది. మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electric Shortcircute) కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావించినప్పటికీ తాజాగా లభించిన సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఒక గుర్తుతెలియని మహిళ భవనంలోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు లభించడంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన సజీవ దహన కుట్ర కావచ్చు అనే కోణంలో ఢిల్లీ పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు.
కాగా ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్ర గాయాలపాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 12 తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అయితే భవనం వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా తెల్లవారుజామున సరిగ్గా 2:23 గంటల సమయంలో ముసుగు ధరించిన ఒక మహిళ లోపలికి వెళ్లడం కనిపించింది. ఆమె లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే భవనంలో మంటలు అంటుకున్నట్టు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెంటనే సదరు మహిళ వేగంగా భవనం నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
ఆమె కదలికలు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయని తేల్చిన పోలీసులు సదరు మహిళను ఇప్పటికే గుర్తించామని, ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తున్న పంకజ్ (28), ఆయన తల్లి గుడ్డి దేవి (50), సోదరి సోని (20) మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పంకజ్ చిన్న చెల్లెలు మోని (18), అమ్మమ్మ సుశీలా దేవి (70) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మిగిలిన అంతస్తుల్లోని వారిని సురక్షితంగా రక్షించారు.