కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జయా థియేటర్ అగ్నికి ఆహుతయింది. రాష్ట్రంలోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన జయా సినిమాస్‌లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. 50 ఏండ్ల నాటి ఈ సినిమా టాకీస్ పై అంతస్తులో నిన్న రాత్రి 9.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి టాకీస్ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజిన్ల సహాయంతో.. అర్థరాత్రి దాటిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.
‘థియేటర్ పై అంతస్తులో టాకీస్ కేర్‌టేకర్ కుటుంబం నివాసం ఉంటుంది. నిన్న రాత్రి వారు వంట వండుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రమంగా మంటలు థియేటర్ మొత్తానికి వ్యాపించాయి. మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించాం’ అని పోలీసులు తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో థియేటర్ మూతపడింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.