Maha kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా (Maha kumbha Mela) లో తొక్కిసలాట ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన ఈ కుంభమేళాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
సెక్టర్ 22లో ఛత్నాగ్ ఝాన్సీ (Chhatnag Jhunsi) ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా, కుంభమేళా ప్రారంభమైన 18 రోజుల వ్యవధిలోనే అక్కడ అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి.
తొలుత ఈనెల 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆతర్వాత వారం రోజులకే అంటే ఈనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. అక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా దగ్ధం కాగా, మరో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. అయితే, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
ఇక మౌని అమావాస్య సందర్భంగా 29వ తేదీ అంటే బుధవారం సంగమం వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు. దాదాపు 40 మంది గాయపడ్టట్లు వెల్లడించారు. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి అగ్నిప్రమాదం సంభవించడంతో యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumbh: వీవీఐపీ పాసులు రద్దు.. నో వెహికల్ జోన్‌గా మహాకుంభ్