Maha Kumbh | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళా ఓ అరుదైన ఘటనకు వేదికైంది. దాదాపు 27 ఏళ్ల కిందట తప్పిపోయిన వ్యక్తిని కుటుంబం తిరిగి కలుసుకుంది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఉంటాయని భావించిన జార్ఖండ్‌కు చెందిన కుటుంబానికి సదరు వ్యక్తి సాధువుగా మారి కనిపించాడు. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో గతంలో తప్పిపోయిన బంధువును తిరిగి గుర్తించినట్లుగా ఓ కుటుంబం తెలిపింది. దాదాపుగా 27 సంవత్సరాలుగా ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తప్పిపోయిన వ్యక్తి గంగాసాగర్ వయసు 65 సంవత్సరాలు కాగా.. అఘోరీ సాధువుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరు బాబా రాజ్‌కుమార్‌గా మారింది.
1998 పాట్నాలో గంగాసాగర్ కనిపించకుండా పోయాడని కుటుంబం పేర్కొంది. అప్పటి నుంచి ఆయన భార్య ధన్వాదేవి ఒంటరిగా ఇద్దరు పిల్లలు కమలేశ్, విమలేష్‌ను పెంచి పెద్ద చేసింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ మాట్లాడుతూ తాము మళ్లీ గంగాసాగర్‌ను చూస్తామనే ఆశను కోల్పోయామని.. కానీ కుంభమేళాకు వచ్చిన తమ బంధువులు కొందరు గంగాసాగర్‌లో కనిపించే వ్యక్తి ఫొటో తీసి పంపారన్నారు. ఆ తర్వాత తనతో పాటు ధన్వాదేవి, ఇద్దరు కొడుకులు కలిసి కుంభమేళాకు వచ్చినట్లు తెలిపారు. కుంభమేళాకు వచ్చిన సమయంలో గంగాసాగర్‌ను కలిశారు. అయితే, గంగాసాగర్ యాదవ్ పాత ఐడెంటిటీని అంగీకరించేందుకు నిరాకరించారు. తన పేరు బాబా రాజ్‌కుమార్ అని.. వారణాసికి చెందిన సాధువుగా చెప్పుకున్నారు. ఆ కుటుంబ వాదనలను ఖండించారు.
అయితే, బాబా రాజ్‌కుమార్ పూర్తిగా గంగాసాగర్ యాదవ్‌ను పోలి ఉండటంతో కుటుంబం వాదనలను బలపరిచాయి. అతని నుదుటిపై, మోకాలిపై ఉన్న గాయం గుర్తులు గంగాసాగర్ యాదవ్లాగే ఉన్నాయి. కుంభమేళా ముగిసే వరకు తాము సైతం ప్రయాగ్‌రాజ్‌లోనే ఉంటామని మురళీ యాదవ్ తెలిపారు. డీఎన్ఏ టెస్టులకు సైతం రెడీ ఉన్నామన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌గా వస్తే బాబా రాజ్ కమార్‌కు క్షమాపణలు చెబుతామన్నారు. కుటుంబంలోని పలువురు వ్యక్తులు జార్ఖండ్‌కు తిరిగి చేరుకోగా.. మరికొందరు ఆయన కోసం ప్రయాగ్‌రాజ్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం వారంతా సాధువుగా మారిన బాబా రాజ్‌కుమార్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు.