న్యూఢిల్లీ, మే 3: ఢిల్లీలోని వివేక్ విహార్లో ఆదివారం తెల్లవారుజామున ఒక నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి తొమ్మిది మంది మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే 12 అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మరణించిన తొమ్మిది మందిలో ఐదు మృతదేహాలు భవనంలోని రెండవ అంతస్తులో లభించాయి. మరో మూడు మృతదేహాలు మెట్ల పైన లభించాయి. మరో వ్యక్తి మృతదేహం మొదటి అంతస్తులో లభించింది.
మృతులలో ఏడాది వయసున్న బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఒక చిన్నారి మరణించినట్లు పోలీసులు తెలిపారు. డజను మందికిపైగా భవన నివాసితులను రక్షించినట్లు సహాయక సిబ్బంది చెప్పారు. భవనంలోని రెండు, మూడు, నాలుగవ అంతస్తులకు మంటలు వ్యాపించినట్లు పోలీసులు చెప్పారు.