అయోధ్య : అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అయోధ్యలో భారీ చోరీ జరిగింది. రామ మందిరానికి దారితీసే భక్తిపథ్, రామ్‌పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 50 లక్షల పైమాటే. రామ మందిర నిర్మాణం అనంతరం భక్తిపథ్, రామ్‌పథ్‌లో వెదురు లైట్లు, ప్రొజెక్టర్ లైట్లు ఏర్పాటు చేసి అందంగా తీర్చదిద్దారు. ఇప్పుడు వీటిలో 3800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లు చోరీకి గురయ్యాయి. ఈ నెల 9నే ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది. రామ్‌పథ్‌లో మొత్తం 6400 వెదురు లైట్లు, భక్తిపథ్లో 96 ప్రొజెక్టర్ లైట్లు ఏర్పాటు చేశారు. మార్చి 19 వరకు అన్నీ ఉన్నాయి. మే 9న చేసిన తనిఖీల్లో కొన్ని లైట్లు అదృశ్యమైనట్టు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 3,800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఆలయ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బెంగళూరు: ప్రభుత్వ ఖాతాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లతో కర్ణాటక ప్రభుత్వం లావాదేవీలను నిలిపివేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ విభాగాలకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆయా బ్యాంకుల్లోని తమ ఖాతాలను మూసేయటంతోపాటు, డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని, సెప్టెంబర్ 20 కల్లా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ‘ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, వర్సిటీలు, ఇతర విద్యా సంస్థలు ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకుల్లో ఖాతాలను రద్దు చేసుకోవాలి. కొత్తగా లావాదేవీలు, డిపాజిట్లు చేయరాదు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.