న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) మరో కేసు నమోదైంది. ‘భారత రాజ్యంతో పోరాటం’ అని ఆయన వ్యాఖ్యానించడంపై అస్సాం రాజధాని గౌహతికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. మేం ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతో పోరాడుతున్నాం’ అని అన్నారు.
కాగా, రాహుల్ గాంధీ అన్న ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. అస్సాం రాజధాని గౌహతికి చెందిన మోంజిత్ చెటియా దీనిపై ఫిర్యాదు చేశాడు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రేకెత్తిస్తున్నారని ఆరోపించాడు. శాంతి భద్రతలు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.