Panchayati Raj | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: మనదేశంలోని చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచి. అధికారం అంతా భర్తలు లేదా తండ్రులదే. ఇలా పరోక్షంగా పెత్తనం చేస్తూ, మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు సలహా మేరకు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ అధ్యక్షతన కేంద్రం ఈ కమిటీని వేసింది. ఇది ఇటీవల పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖకు తన నివేదికను సమర్పించింది.
ఇందులో భర్తలు, తండ్రులు, ఇతర పురుష బంధువుల పాత్రను నిరోధించాలంటే మహిళలకు వ్యవస్థాగతంగా ప్రభుత్వం అండగా నిలవాలని పేర్కొన్నది. ఎన్నికైన మహిళా ప్రతినిధులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేయాలని, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుక ఒక వ్యవస్థను తీసుకురావాలని కమిటీ సూచించింది.