న్యూఢిల్లీ, ఆగస్టు 6: అంతర్జాతీయ ప్రతిభకు అయస్కాంతంలా నిలిచిన అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ చారిత్రక విచ్ఛిన్నతను ఎదుర్కొంటున్నది. వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన అనేక మంది అంతర్జాతీయ విద్యార్థులు ఈ విద్యా సంవత్సరానికి సకాలంలో వీసాలు పొందలేక ప్రవేశాలకు దూరమవుతున్నారు.
ఈ పరిణామాలు కేవలం విద్యాపరమైనవే కావని, అస్తిత్వపరమైనవని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జూన్ మధ్యలో నెల రోజుల విరామాన్ని ఎత్తివేసినప్పటికీ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను ఇప్పటికీ తీవ్రంగా పరిమితం చేయడంతో వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు దీర్ఘకాలిక జాప్యాలను, అదనపు పరిశీలనను, కొన్ని సందర్భాల్లో పూర్తిగా తిరస్కరణలను ఎదుర్కొంటున్నారు.
దీని ప్రభావాలు తక్షణంగా, విస్తృతంగా ఉండటంతో యూనివర్సిటీల బడ్జెట్లకు, ఎన్రోల్మెంట్ డైవర్సిటీకి, ఉన్నత విద్యకు ప్రధాన గమ్యస్థానంగా అమెరికాకు ఉన్న ఖ్యాతికి ముప్పు వాటిల్లుతున్నది. వీసాల మంజూరులో భారత్, చైనా విద్యార్థులకు మధ్య ఏకంగా 7 రెట్ల వ్యత్యాసం ఉన్నట్టు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఓ ప్రైవేట్ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.మరోవైపు ఈసారి అమెరికాకు కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 30% మేరకు తగ్గవచ్చని ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ (నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్ అడ్వైజర్స్), జేబీ ఇంటర్నేషనల్ సంస్థలు అంచనా వేశాయి.