న్యూఢిల్లీ: దేశంలోని వేర్వేరు నగరాల మధ్య 7 హైస్పీడ్ రైల్ కారిడార్లతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డంకుని, గుజరాత్‌లోని సూరత్ మధ్య కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు కానున్నాయి. పర్యావరణ పరంగా స్థిరమైన ప్రయాణికుల వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మధ్య గ్రోత్ కనెక్టర్లుగా హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వీటివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 17 మెటాలిక్ ఎలిమెంట్స్‌ను రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు.