న్యూఢిల్లీ, ఆగస్టు 30 : జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో వాయుసేనకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మూడు నెలల తర్వాత ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ప్రజలతో పంచుకున్నారు. ఆ ఆపరేషన్‌లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లలో ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా జరిపిన దాడుల్లో భారత వైమానిక దళం 50 కన్నా తక్కువ ఆయుధాలను మాత్రమే ప్రయోగించిందని వెల్లడించారు.
కేవలం 50 ఆయుధాల ప్రయోగానికే పాకిస్థాన్ తట్టుకోలేక బేర్ మంటూ కాళ్ల బేరానికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీటీవీ రక్షణ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన దృశ్యాలు, వివరాలను విడుదల చేశారు. ‘50 కంటే తక్కువ ఆయుధాలతో మేము సంఘర్షణ నిర్మూలనను సాధించగలిగాం’ అని పేర్కొన్నారు. ‘మన ఈ విజయానికి భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ (ఐఏసీసీఎస్) కారణం’ అని ఆయన తెలిపారు.