లక్నో, ఆగస్టు 21 : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో తలెత్తిన ఎరువుల కొరత రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభానికి దారితీసింది. అనేక జిల్లాలలో రైతులు నిరసనలకు దిగడంతో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం లాఠీచార్జీ చేశారు. అయోధ్య నుంచి బారాబంకీ వరకు, బలరాంపూర్ నుంచి దేవరియా వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడడంతో వేలాదిమంది రైతులు ఎర్రటి ఎండలో ఎరువుల కోసం దుకాణాల వద్ద బారులుతీరి నిలబడి చివరకు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నారు.
గంటల తరబడి క్యూలైన్లలో నిలబడినా ఎరువులు దక్కకపోవడంతో అనేక చోట్ల రైతులు పట్టలేని ఆగ్రహంతో ఆందోళనకు దిగుతున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నారు.