వృత్తిపై నిబద్ధ ఏపాటిది? అన్న అంశం తెలియాలంటే క్లిష్ట పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడే తెలిసి వస్తుంది. ప్రజలపై ఉద్యోగులకు ప్రేమ ఏపాటిది? అన్న విషయం కూడా సమయం వస్తేనే బయటపడుతుంది. ప్రభుత్వాలు గట్టిగా సంకల్పిస్తే సరిపోతుందా? ఉద్యోగులు తదనుగుణంగా క్షేత్ర స్థాయిలో పనిచేసి, లక్ష్యాలను చేరుకుంటేనే కదా… ఫలితాలు వచ్చేవి. ప్రస్తుతం దేశమంతా కరోనా, ఒమిక్రాన్ కేసులతో సతమతవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయించాలన్న దృఢ సంకల్పంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూనే వున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు కూడా అత్యంత శ్రద్ధాసక్తులతో ఈ వ్యాక్సినేషన్ కోసం అహర్నిశలు పాటుపడుతూనే వున్నారు.
ఇందులో భాగంగా రాజస్థాన్లో ఆరోగ్య కార్యకర్తల వృత్తి నిబద్ధత ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆరోగ్య కార్యకర్త ఒకరు రాజస్థాన్లోని ఓ ప్రాంతానికి ఒంటెపై ప్రయాణించి, ఓ మూలన ఉన్న కుగ్రామంలోని ప్రజలకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఈ ఫొటోను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సంకల్పం, కర్తవ్య నిష్ఠ కలగలసిన ఫొటో ఇది. రాజస్థాన్లోని బాడ్మేర్ జిల్లాలో వ్యాక్సినేషన్ వేస్తున్న ఫొటో ఇదీ అంటూ మన్సుఖ్ మాండవ్య ఫొటోలను పోస్ట్ ఇచ్చారు. మరోవైపు ప్రజలు కూడా ఆ ఆరోగ్య కర్త వృత్తి నిబద్ధతకు హ్యాట్సాఫ్ చేబుతూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.