Female bodyguards | బ్లూ సఫారీ సూట్ ధరించి చేతుల్లో ఏకే 47, ఎక్స్-95 సబ్ మెషిన్ గన్ వంటి ఆయుధాలతో 9 మంది మహిళా అంగరక్షకులు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ ఫొటోలు ఏ సినిమావో లేదా సిరీస్‌లో భాగమో కాదు. ఈ మహిళా బాడీగార్డులంతా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోర్ సెక్యూరిటీ టీంలో చేరారు. మన దేశంలో ఇలా ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ కోర్ టీంలో మహిళా బాడీగార్డులు ఉండటం ఇదే తొలిసారి. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం చాలా మంది ప్రముఖులు తమ భద్రత కోసం మహిళా గార్డులను నియమించుకున్నారు.
సీఎం స్టాలిన్ కోర్ సెక్యూరిటీ టీంలో చేరేందుకు 80 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9 మంది మహిళా అంగరక్షకులను ఎంపిక చేశారు. సీఎం కోర్ సెక్యూరిటీ టీంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎం తనుష్ కన్నకి, హెడ్ కానిస్టేబుల్ ఎం దిల్సత్ బేగం, కానిస్టేబుళ్లు ఆర్ విద్య, జే సుమతి, ఎం కాళీశ్వరి, కే పవిత్ర, జీ రామి, వీ మోనిషా, కే కౌసల్య ఉన్నారు.
ఈ మహిళా అంగరక్షకులందరూ ఆయుధాలు లేకుండా పోరాటం చేయడం, తుపాకులతో ఫైరింగ్ చేయడం, బాంబుల్ని గుర్తించడం, క్రౌడ్ హ్యాండ్లింగ్, కార్-బైక్ డ్రైవింగ్‌తో పాటు ఒత్తిడి, ఆర్థిక నిర్వహణలో శిక్షణ పొందారు. ఎంపికైన తర్వాత కూడా వీరి శిక్షణ కొనసాగుతున్నది. ఈ మహిళా అంగరక్షకులందరూ మరుధం కమాండో శిక్షణా కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి శిక్షణ తీసుకుంటారు. నిత్యం దాదాపు 3 కి.మీ పరుగెత్తాల్సి ఉంటుంది. వీటితో పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషంలో 30 పుషప్‌లు తీయడం వంటి కఠిన శిక్షణ అందిస్తున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కన్నా ముందు చాలా మంది ప్రముఖులు తమ భద్రతకు మహిళా బాడీగార్డులను నియమించుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్, మేఘన్ మెర్కెల్, పాప్ సింగర్ బియాన్స్‌లు కూడా తమ కోర్ టీంలో మహిళా అంగరక్షకులకు స్థానం కల్పించారు. లిబియాను 40 ఏండ్లపాటు పాలించిన నియంత కల్నల్ గడాఫీ తన హైఫై జీవనశైలి కారణంగానే వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. 1980 లో తన రక్షణ కోసం మహిళా అంగరక్షకుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బృందానికి ‘ది రివల్యూషనరీ నన్స్’ అని పేరు కూడా పెట్టారు. గడాఫీ ఎక్కడికి వెళ్లినా తన భద్రత, హౌస్ కీపింగ్ కోసం 15 మంది మహిళా అంగరక్షకులు అతనితో పాటు ఉండేవారు.