న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవూర్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి తీసుకువస్తున్నారు. ఇవాళ అతను ఇండియాకు రానున్నాడు. అతన్ని ఢిల్లీలోని తీహారు జైలులో నిర్బంధించే అవకాశాలు ఉన్నాయి. హై సెక్యూర్టీ వార్డులో అతన్ని పెట్టనున్నారు. తీహారు జైల్లో రాణా కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కోర్టు ఆదేశాల కోసం ప్రిజన్ అధికారులు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్లో పుట్టి, కెనడా పౌరసత్వం ఉన్న తహవూరు రాణా.. 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో నిందితుడు. అమెరికా అతన్ని అప్పగిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లయిట్లో తీసుకువస్తున్నారు.
అమెరికా పౌరుడు డేవిడ్ కోల్మన్తో కలిసి ఉగ్రదాడికి తహవూరు ప్లాన్ వేసినట్లు తెలిసింది. భారత్కు అప్పగించ వద్దు అని రాణా.. అమెరికా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.కానీ పలు మార్లు ఆ పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో రాణాను తీసుకువచ్చేందుకు ఓ టీమ్ అమెరికా వెళ్లింది. అమెరికాకు చెందిన ప్రిజన్స్ బ్యూరో కూడా ప్రకటన రిలీజ్ చేసింది. రాణా తమ కస్టడీలో లేనట్లు చెప్పింది. నాట్ ఇన్ బీఓపీ కస్టడీ అని ప్రిజన్స్ బ్యూరో తన వెబ్సైట్లో పేర్కొన్నది. 2025 ఏప్రిల్ 8వ తేదీ నుంచి తహవూర్ రాణా తమ కస్టడీలో లేన్నట్లు ప్రిజన్స్ బ్యూరో స్పష్టం చేసింది.