Shiv Sena | మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో రాజేష్ షాపై శివసేన చర్యలు చేపట్టింది. ఆయన్ని పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ బుధవారం ప్రకటించింది. కాగా, ఈ కేసులో రాజేష్ షా అరెస్టై సోమవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
ఇటీవలే ముంబైలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్ ( Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న దంపతులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. అలాగే వేగంగా వెళ్తున్న కారు కావేరి నక్వా (45) పై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత మిహిర్ ఫోన్లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్, డ్రైవర్ బిదావత్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. మిహిర్ తొలుత మహిళను ఢీకొన్న తర్వాత ఆమెను 1.5 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లాడు .తర్వాత వాహనం టైరులో చిక్కుకున్న ఆమెను రోడ్డుపై పడేశాడు. తర్వాత బిదావత్ కారు నడిపాడు. కారును రివర్స్ చేసేటప్పుడు ఆమెపై నుంచి మరోసారి కారును ఎక్కించాడు. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిహిర్ షాను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని విరారా ప్రాంతంలో మిహిర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. మిహిర్ తల్లి, ఇద్దరు తోబుట్టువులతోపాటు మరో 10 మందిని విచారించినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
MUDA Scam | కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు.. సిద్ధరామయ్య సహా తొమ్మిది మందిపై ఫిర్యాదు
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్‌కు మరోసారి సమన్లు పంపిన ఈడీ