Jammu Kashmir Assembly Elections : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధిస్తుందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పాకిస్తాన్‌తో చర్చల పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా అని ప్రశ్నించగా తమ మేనిఫెస్టోలో అన్ని అంశాలూ ఉన్నాయని పేర్కొన్నారు.
ఈసారి ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని, తమ కూటమి మెరుగైన సామర్ధ్యం కనబరిచి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి తాము బీజేపీకి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్‌గా జట్టు కట్టామని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా అంతకుముందు వ్యాఖ్యానించారు.
తొలి దశ పోలింగ్‌కు ఈరోజు నామినేషన్లకు చివరి తేదీ అని, తాము ఇప్పటికే తమ మేనిఫెస్టో, రోడ్‌మ్యాప్‌ను ప్రజల ముందుంచామని చెప్పారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ సీట్ల సర్దుబాటుపై అంగీకారానికి వచ్చిన ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ మొత్తం 90 స్ధానాలకు గాను 51 స్ధానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 32 స్దానాల్లో అభ్యర్ధులను బరిలో నిలపనుంది.
ఐదు స్ధానాల్లో ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీతో బరిలో దిగనున్నాయి. ఇక ఇరు పార్టీలు సీపీఐ, సీపీఎంలకు చెరొక సీటును విడిచిపెట్టాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ స్దానాల సంఖ్య కంటే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఐక్యంగా పోటీ చేస్తున్నాయని జమ్ము కశ్మీర్ పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ పేర్కొన్నారు.
Read More :
AP News | తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. టీడీపీకి వైసీపీ స్ట్రాంగ్ వార్నింగ్