AP News | తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైసీపీ పార్టీ హెచ్చరించింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలు చేస్తారా? అని మండిపడింది. ఓ బాలీవుడ్ నటిని వైసీపీ నాయకుడు వేధిస్తే.. ఆమెను బెదిరించేందుకు ఐపీఎస్‌లను నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ టీడీపీ చేసిన ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఏపీ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయని వైసీపీ తెలిపింది. మీ రాజకీయ ప్రత్యర్థులపైన, మీ వ్యతిరేక పార్టీలపైన మీరు ప్రయోగించే అనైతిక సూత్రమే “వ్యక్తిత్వ హననం” అని మండిపడింది. మీరు నమ్మిన సిద్ధాంతమే ఇది అని పేర్కొంది.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యమని రాశారని.. బాలకృష్ణ తుపాకీతో కాల్పులు జరిపితే, ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చారని వైసీపీ గుర్తుచేసింది. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఫీజులను ఒక పారిశ్రామికవేత్తతో కట్టించి, అది నారా లోకేశ్ ప్రతిభ అన్నారని పేర్కొంది. మహిళలతో అసభ్యంగా తైతక్కలాడితే అవి చిన్ననాటి సరదాలు అంటారని తెలిపింది. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోతే కనీసం వాయిస్ శాంపిల్ ఇవ్వకుండా చంద్రబాబు తప్పించుకున్నారని పేర్కొంది. మీలో నీతి లేదు, నిజాయితీ అంతకన్నా లేదని మండిపడింది. నైతికత ఇసుమంతైనా మీలో కనిపించడం లేదని విమర్శించింది.
కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఓ బాలీవుడ్ నటిని వైసీపీ నాయకుడు వేధించారని ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ స్పందిస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడింది. ముంబైకి చెందిన నటిని కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని.. పెళ్లి చేసుకోమని అడిగితే అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు దిగాడని వైసీపీ ఆరోపించింది. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి మరీ హీరోయిన్ను విజయవాడకు తీసుకొని వచ్చి ఆమెను వేధింపులకు గురిచేశారని విమర్శించింది.
బాలీవుడ్ హీరోయిన్‌పై వైసీపీ నేత వేధింపుల విషయంలో నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్రెస్ట్ అని వైసీపీ ప్రశ్నించింది. ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ విషయాన్ని డీల్ చేశారంటే జగన్ రెడ్డి అనుమతులు లేకుండానే జరుగుతుందా? అని నిలదీసింది. బాలీవుడ్ హీరోయిన్ను వేధించడంలో ఏకంగా నాటి సీఎంవో ప్రమేయం ఉందంటే.. జగన్ రెడ్డి ఎలాంటి మాఫియా నడిపాడో అర్థమవుతుందని ఎద్దేవా చేసింది. మీ ముఖ్య సలహాదారు సజ్జలను ఇలాంటి బ్రోకర్ పనులకు వాడతావా? అని మండిపడింది. నీకింద ఉండే ఐపీఎస్‌లను ఇలాంటి తప్పుడు పనుల కోసం వాడుకుంటావా? మీకు నచ్చిన హీరోయిన్లను వేధించి లొంగదీసుకోవడానికా మీకు అధికారాన్ని ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.