Farooq Abdullah | భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆకాశానికెత్తారు. ఆయనను పొగడ్తల్లో ముంచెత్తారు. మూడు రోజులుగా జమ్ముకశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర చేస్తున్నా రాహుల్‌గాంధీని ఫరూక్ అబ్దుల్లా కలిసి ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.
రాహుల్‌గాంధీని పరూక్ అబ్దుల్లా ఆదిశంకాచార్యతో పోల్చారు. ఆదిశంకరాచార్యుల తర్వాత కన్యాకుమారి నుంచి కశ్మీరం దాకా పాదయాత్ర చేపట్టిన రెండో వ్యక్తి రాహుల్ గాంధీ అని ప్రశంసల్లో ముంచెత్తారు. శతాబ్దాల క్రితం రోడ్డు వసతి లేని ప్రాంతాల్లో ఆదిశంకరాచార్య కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచారని గుర్తుచేశారు. ఆయన బాటలోనే నడిచి రెండో వ్యక్తిగా రాహుల్ నిలిచారని కొనియాడారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై కూడా ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన చేశారు. పాక్‌తో చర్చలు జరిగే వరకు ఈ సమస్య సజీవంగానే ఉంటుందన్నారు. ఈ మాటల్ని నా రక్తంతో రాసిద్దేందుకు సిద్ధమని అబ్దుల్లా చెప్పారు.
విద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యం అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ‘ఇది గాంధీ, రామ్‌ల దేశం. ఇక్కడ మనమంతా ఒక్కటే. భారతదేశంలో విద్వేషాలు సృష్టించి, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ యాత్ర భారతదేశాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నది’ అని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. ఇలాఉండగా, జమ్ముకశ్మీర్‌లో రాహుల్ పాదయాత్ర 9 రోజులపాటు కొనసాగనున్నది. జనవరి 30 న యాత్ర ముగియనున్నది.