న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆదివారం పిలుపునిచ్చింది. రైతుల పెండింగ్ డిమాండ్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఎస్కేఎం (రాజకీయేతర) కన్వీనర్ జగ్జీత్ సింగ్ డల్లేవాల్ 48 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించి, దానికి చట్టబద్ధత కల్పించాలని ఎస్కేఎం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన నియమావళిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా/సబ్ డివిజన్ స్థాయుల్లో ట్రాక్టర్/వాహనాలు/మోటార్ బైక్ మార్చ్‌లను నిర్వహించాలని రైతులకు పిలుపునిచ్చింది. కిసాన్ మజ్దూర్ మోర్చాతో సోమవారం సమావేశమవుతామని తెలిపింది.