జైపూర్: ప్రకృతి విపత్తులు రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఆపదలో ఆదుకుంటామని నమ్మబలికే బీమా కంపెనీలు వాస్తవంగా నష్టపోయిన రైతుకు ముఖం చాటేస్తున్నాయి. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా, దేవరియ జతన్ గ్రామస్థుడు మల్లారం బావరి ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన తన పొలంలో పత్తి పంట పండించేందుకు బ్యాంకు నుంచి రూ.1 లక్ష రుణం తీసుకున్నారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి పంట మొత్తం ధ్వంసమైంది. కేవలం రూ.4,000 విలువైన పంట మాత్రమే మిగిలింది.
పంట బీమా చేయించాననే ధీమాతో ఆయన బీమా కంపెనీకి సమాచారం ఇచ్చారు. కానీ అధికారులెవరూ ఆయనవైపు చూడలేదు. దీంతో విసుగెత్తిన ఆయన రూ.500 నోట్లను తన పొలంలో నాటారు. ప్రభుత్వ పథకాలు, అధికారుల ఉదాసీనత వల్ల తాను నిరాశకు లోనయ్యానని, తన నిరసనను తెలిపేందుకే కరెన్సీ నోట్లను పొలంలో నాటానని ఆయన చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతున్నది.