ఆనంద్, జనవరి 6: ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును కొందరు వ్యక్తులు చితకబాది, అనంతరం ఆయనకు నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ రైతు ప్రస్తుతం వడోదరలోని సాయాజీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అంకాలవ్ గ్రామ మహిళా సర్పంచ్, ఆమె భర్త అవినీతికి పాల్పడుతున్నారని, వారిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ 50వ పడిలో ఉన్న రైతు భరత్ పధియార్ గుజరాత్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆదివారం రైతు ఇంటికి కారులో వచ్చిన సర్పంచ్ కోకిలా పధియార్, ఆమె భర్త దినేశ్ పధియార్, కుమారులు, ఇతర బంధువులు కర్రలతో భరత్పై దాడి చేశారు. అనంతరం రైతును నడిరోడ్డుకు ఈడ్చుకుని వచ్చిన సర్పంచ్.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. బాధితుడు దవాఖానలో చికిత్స పొందుతుండగా అయిదుగురి నిందితులపై హత్యాయత్నం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.