భోపాల్: చేతికి అందివచ్చిన పంటను అధికారులు నాశనం చేశారు. ట్రాక్టర్లతో చేనును ధ్వంసం చేశారు. రైతు, అతడి భార్య వేడుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో కోతకు వచ్చిన పంట నాశనం కావడం చూసి తట్టుకోలేక ఆ రైతు కుప్పకూలిపోయాడు. (Farmer Collapses) మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిరోంజ్లోని కేతన్ ఆనకట్ట ప్రాంతంలో సుమారు 20 ఎకరాల్లోని పంటను అధికారులు ధ్వంసం చేశారు. చేనులో ట్రాక్టర్ నడిపి కోత దశకు వచ్చిన పంటను నాశనం చేశారు. రైతు మూల్చంద్, అతడి భార్య ఎంత ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో పంట నాశనం కావడం చూసి షాక్తో రైతు మూల్చంద్ అక్కడ కుప్పకూలిపోయాడు. అధికారులు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, తమ చర్యను అధికారులు సమర్థించుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని స్థానిక రెవెన్యూ అధికారి వికాస్ అగర్వాల్ తెలిపారు. ఆక్రమణ నుంచి ఆ భూమిని విడిపించేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
మరోవైపు గత ఏడాది అక్టోబర్లో ఆ భూమికి జరిమానా కూడా కట్టినట్లు రైతు మూల్చంద్ తెలిపాడు. దాని రశీదు కూడా తన వద్ద ఉందని చెప్పాడు. అయినప్పటికీ అధికారులు వినిపించుకోకుండా తన పంటను నాశనం చేశారని ఆ రైతు వాపోయాడు. ఈ నేపథ్యంలో రైతు పంటను ధ్వంసం చేసిన అధికారుల తీరుపై విమర్శలతోపాటు రాజకీయంగా ఇది దుమారం లేపింది.