లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్లో సుమారు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. త్రివేణి సంగమ తీరం సుమారు 45 రోజుల పాటు జనంతో కిక్కిరిసిపోయింది. అయితే అక్కడ బోట్లు నడుపుకునే ఓ కుటుంబం 30 కోట్లు ఆర్జించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మంగళవారం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో.. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ప్రతిపక్షాలకు కౌంట్‌డౌన్ మొదలైందని, వాళ్లను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని నావికుల్ని ప్రభుత్వం దోచుకున్నట్లు చేసిన ఆరోపణలపై సీఎం యోగి బదులిస్తూ.. ఓ నావికుల కుటుంబం సక్సెస్ స్టోరీ చెబుతానన్నారు. ఆ కుటుంబానికి 130 బోట్లు ఉన్నాయని, 45 రోజల మహాకుంభ్ సమయంలో వాళ్లు 30 కోట్లు సంపాదించారని, అంటే ప్రతి బోటుపై 23 లక్షలు వచ్చాయని, అంటే ప్రతి రోజు వాళ్లు 52 వేల వరకు ఆర్జించారని సీఎం వెల్లడించారు. మహాకుంభ్‌ను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించామని, శాంతి భద్రతలకు సమస్య రాలేదన్నారు. 66 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు ప్రయాగ్‌రాజ్‌లో అమృత స్నానాలు ఆచరించారని, ఒక్క నేర ఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు.
వేధింపులు, కిడ్నాప్‌లు, దొంగతనం, మర్డర్ లాంటి ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. 66 కోట్ల మంది వచ్చి .. సంతోషంగా వెళ్లారని, రాలేని వారు మిస్సైనట్లు భావిస్తున్నారని, వచ్చి వెళ్లినవారు తన్మయత్వంలో ఉన్నారని ఆయన అన్నారు. మహాకుంభ్ కోసం 7500 కోట్లు పెట్టుబడి పెట్టామని, దాని ద్వారా వివిధ రంగాలకు సుమారు మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు సీఎం వెల్లడించారు. మహాకుంభ్ ఈవెంట్ ద్వారా హోటల్ పరిశ్రమకు 40 వేల కోట్లు, ఆహార.. నిత్యావసరాలకు 33 వేల కోట్లు, రవాణాకు 1.5 లక్షల కోట్లు, మతపరమైన కార్యక్రమాలకు 20 వేల కోట్లు, విరాళాల రూపంలో 660 కోట్లు, టోల్ ట్యాక్స్ రూపంలో 300 కోట్లు, ఇతర ఆదాయం రూపంలో 66 వేల కోట్లు వచ్చినట్లు సీఎం యోగి అసెంబ్లీలో తెలిపారు.