ముంబై: ఒక కుటుంబం పీపీఈ కిట్లు (PPE Kits) ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపారు. విస్తూపోయే ఈ సంఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో జరిగింది. తితవలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.
కాగా, పొగ వల్ల అక్కడి చెట్టుకు ఉన్న తేనెటీగలు విజృంభించాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులపై అవి దాడి చేశాయి. దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు ఆటంకం కలిగింది.
మరోవైపు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొందరు వ్యక్తులు వెళ్లారు. అక్కడి నుంచి ఐదు పీపీఈ కిట్లు తెచ్చారు. మృతుడి కుమారుడు, ముఖ్యమైన బంధువులు వాటిని ధరించారు. సుమారు రెండు గంటల తర్వాత అంత్యక్రియలను పూర్తి చేశారు.