Air India crash : గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలచివేసింది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా మరో 19 మంది మరణించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. విమానంలోని బ్లాక్ బాక్స్ డాటాను విడుదల చేయాలని లేఖలో కోరారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్‌కు చెందిన 30 మంది మృతుల కుటుంబ సభ్యులు శనివారం అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విమాన ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఇంకా వెల్లడికాని సీవీఆర్, బ్లాక్‌బాక్స్ డాటాను విడుదల చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. అలాగే, లేఖకు సంబంధించిన కాపీల్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ), డీజీసీఏ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు పంపారు. విమాన ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకోవాలి అనుకుంటున్నామని, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా అనే విషయం తమకు తెలియాలని కోరుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. అలాగే, బ్లాక్‌బాక్స్‌లోని సమాచారం బహిరంగంగా వెల్లడించడం వీలుకాకపోతే, తమకు వ్యక్తిగతంగా అందజేసినా చాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు మృతులకు సంబంధించిన కొన్ని సామగ్రి అందించడంలో విమానయాన సంస్థ విఫలమైందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో సంస్థ నుంచి సరైన సహకారం లేదని విమర్శించాయి.
ఈ ప్రమాదంపై ఇప్పటికే ఏఏఐబీ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను గత జూలైలో విడుదల చేసింది. పూర్తిస్థాయి నివేదికను వచ్చే జూన్‌లో విడుదల చేయబోతుంది. గత ఏడాది జూన్ 12న ఈ ఘటన జరిగింది. బోయింగ్ సంస్థకు చెందిన 787-8 విమానాన్ని ఏఐ 171 అనే పేరుతో ఎయిరిండియా నడిపింది. ఈ విమానం జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయల్దేరింది. టేకాఫ్ అయిన, కొన్ని క్షణాలకే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు.