SBI | రాయ్‌పూర్, అక్టోబర్ 3: ఛత్తీస్‌గఢ్‌లో విస్తుపోయే బ్యాంకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైతం మోసం చేశారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 250 కి.మీ దూరంలోని సక్తి జిల్లా ఛపోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ బ్రాంచ్‌లో అచ్చం అసలైన బ్యాంక్‌లో లాగానే కొత్త ఫర్నీచర్, బ్యాంక్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నకిలీ శాఖ అని తెలియక గ్రామస్థులు ఇందులో ఖాతాలు తెరచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఎస్బీఐ దబ్రా బ్రాంచ్ మేనేజర్‌కు విషయం తెలిసి, గత నెల 27న ఈ బ్రాంచ్‌పై విచారణ చేయడంతో అసలు మోసం బయటపడింది. ఈ ఘరానా నేరంలో నలుగురిని నిందితులుగా గుర్తించారు. ఈ బ్రాంచ్‌లో ఉద్యోగం పొందినవారికి ఇచ్చిన ఆఫర్ లెటర్లు కూడా అచ్చం నిజమైన వాటిలాగే ఉన్నాయి. నకిలీ శాఖలో ఉద్యోగాలను రూ.2 నుంచి రూ.6 లక్షల ధరకు అమ్మినట్టు బాధితులు వాపోయారు.